నిరంతరం/న్యూ ఢిల్లీ
భారతీయ జనతా పార్టీ గురువారం లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. తమిళనాడులో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దక్షిణ చెన్నై నుంచి నియమితులయ్యారు. ఇటీవలే తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన ఆమె మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవ కోసమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని తమిళసై ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమెకు దక్షిణ చెన్నై ఎంపీ టిక్కెట్టు ఇచ్చారు.
మరోవైపు కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థిగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పోటీ చేయనున్నారు. 195 మందితో తొలి జాబితాను ప్రచురించిన బీజేపీ తాజాగా 72 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. తాజాగా గురువారం సాయంత్రం మరో తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లతో మూడో జాబితా విడుదలైంది. దీంతో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 276కి చేరింది.
